ఆలోచనోద్వేగాల సంగమం ‘కంచెమీద పక్షి పాట’

  • – జి. లక్ష్మీనరసయ్య

జీవితాన్ని కేవలం ఆలోచనల హారంగా కుదించడం ఎంత తప్పో– ఒట్టి ఉద్వేగాల, అనుభూతుల కేంద్రంగా వర్ణించడమూ అంతే తప్పు. ఆ పని కవులు జేస్తే మరింత తప్పు. ఇట్లా ఏక కోణంగా బతుకును చిత్రించిన వాళ్లు చాలామంది ఉన్నారు. దీనికి భిన్నంగా ఆలోచనోద్వేగాల సంగమంగా బతుకును అర్ధం చేసుకుంటూ కవిత్వం నిర్మించే కవులూ రచయితలూ ఉన్నత స్థాయి సాహిత్యాన్ని అందించగలిగారు. అలాంటి వారిలో ఇవ్వాళ పది చేతుల్తో రాస్తున్న నూతకోటి రవికుమార్ ఒకడు. కవిత్వాన్ని మానవ ఆలోచనల కూడలిగా మాత్రమే కాక, ఒట్టి ఉద్వేగాల కవాతుగానే కాక — వాటి సమైక్య చిత్తరువుగా, ఒక unified sensibilityగా సృజిస్తున్న కవి రవి కుమార్. అందుకే ఇతని కవిత్వం చదువుతున్నప్పుడు ఎన్ని మానవ ఉద్వేగాలు ముట్టడిస్తాయో, అన్ని ఆలోచనలూ వెంటాడతాయి. తాను పంచుకునే ఆలోచనలన్నీ, భావాలన్నీ అనుభవాల స్పర్శతో, ఉద్వేగాల రాపిడితో అక్షరీకరించబడేట్లు చూడటం ద్వారా ఈ కవి మేలిమి కవిత్వాన్ని సృజించగలిగాడు. సమకాలీన జీవితంపై తాను చేసిన పదునైన విమర్శ మన చూపునో, స్పర్శనో, శబ్ద స్పృహనో, రుచినో, వాసననో తట్టి లేపుతుంది.

ఆలోచనల ఇంద్రియాత్మక అభివ్యక్తిని, sensuous articulation of thoughtని సునాయాసంగా సాధించాడు రవి. అదే ఇతని కవితా కళ. వాక్యాల్ని ఆలోచనావేశాల ప్రతిమలుగా నిర్మించడంలోనే ఈ కవి టెక్నిక్ ఉంది. చారిత్రక దృక్పధం, సమకాలీన సామాజిక, రాజకీయ వ్యవహారాల మీద ఒక రన్నింగ్ కామెంట్రీ తరహా విమర్శ, బెదిరిన జనానికిచ్చే ధైర్యం, చెదిరిన బహుజన శ్రేణులను కూడగట్టగలిగే భరోసా, ఆత్మగౌరవం, బహుజనోద్యమ తాలూకు ఆత్మ విమర్శ, నకిలీ వేకువల సకిలింపుల పట్ల ఏవగింపు, కుల, మత, ఫాసిస్టు శక్తుల్ని ఛాలెంజ్ చేసే తాజా ప్రతిఘటన ఉద్యమాల అవిష్కరణా, సందర్భోచిత తాత్విక ఎరుకా, ప్రపంచీకరణా, కార్పొరేటిజంల నేపధ్యంలో పల్లెల దుస్థితీ , రోహింగ్యాల దుఃఖం, అంతర్జాతీయ ఘటనల మీద స్పందనా, మానవ సంబంధాల మీదా, సున్నితమైన గాఢమైన ప్రేమ గురించిన విభిన్న ప్రకటనా ఈ కవి నిర్వహించిన వస్తువులు. వాస్తవికతతో తగిన కాల్పనికతనీ జోడిస్తూ విశిష్టమైన రీడబిలిటీని సాధించగలిగాడు ఈకవి. ఒక అర్బన్, సొఫిస్టికేటెడ్, టెక్నికల్ పలుకుబడితో రూరల్ న్యాచురల్ బహుజన ఇడియంను కలిపి లిరికల్ పోయెట్రీ డిస్కోర్స్ ను పండించగలిగడమే దీనికి కారణం. ఇటీవల సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రచురించిన తన ‘కంచెమీద పక్షి పాట’ చదివినప్పుడు నాకొచ్చిన ఆలోచనలివి. కవితా గాఢతకీ, కళా తీవ్రతకీ, స్పష్టతకూ మధ్య అంతరాలూ అగాధాలూ లేని రీతిలో సాగిన కవిత్వమిది.పైన నేను ప్రస్తావించిన ఫీచర్స్ తో పాటు అదనపు అందాలూ, విలువలూ వంటబట్టించుకున్న ఈ పుస్తక ప్రపంచంలోకి వెళ్లడం అపురూప అనుభవం. ఏది చెప్పినా సొంత సంవిధానంలో, తనదైన మానసిక ముద్రతో చెప్పడం వల్ల నూతకోటి రవికుమార్ వాక్యం నవనవాలాడుతూ తాజాగా పరిమళించింది.

“అదేంటో పెదాలున్నట్లు కలలు కూడా రావు ప్రశ్నల చుట్టూ బోన్లు విస్తరిస్తాయి అడిస్తున్న బేతాళుడి దేశభక్తి ముందుపడుకున్న చాపకింద రక్తం వరదలై ప్రవహిస్తుంటుంది ఉన్మాదం గుమ్మరించిన తాళింపులో గోళం గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది న్యాయాన్ని ఆశించడం తప్పు దాన్ని విశ్వసించటం ఒప్పు” ఉన్మాదం గుమ్మరించిన తాళింపులో / గోళం గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది’ లాంటి వ్యక్తీకరణలో ఎంత ఉన్నత కవిత్వముందో గమనించండి. ఒక్క స్ట్రోక్ తో జాతీయ, అంతర్జాతీయ పరిస్థితి ఎంత హింసాత్మకంగా ఉందో పట్టిచ్చిన అభివ్యక్తి ఇది. భూమి బిడ్డల్ని టార్గెట్ చేసి సమకాలీన తప్పుడు దేశభక్తి సృష్టిస్తున్న హింసనూ, ఉన్మాదాన్నీ ఇంతకంటే ఎఫెక్టివ్ గా చెప్పటానికేముంది? ‘దళిత మైనార్టీ గూడేల మీద ఇప్పటి సామూహిక యుద్ధం పేరు దేశభక్తి’ అనే వాక్యానికి మించి ఈనాటి పాలకుల ఫాల్తూ నేషనలిజాన్ని ఎండగట్టేదేముంది? దేశం వెలిగిపోతున్న తీరును ఎలా ఎద్దేవ చేస్తున్నాడో చూడండి: “దేశం వెలిగిపోతోంది స్వచ్ఛంగా స్వర్ణ భారతం జబ్బ చరుస్తోంది నిస్సిగ్గుగా నేలకింది నుంచే నీళ్లు దేవుకునే శీతల పానీయాల కంపెనీల హస్తాలేవరివీ? భూమి పొరల్నిపెల్లగించుకుని ఖనిజాల్ని దండుకునే దగుల్బాజీ లెవరు?” పల్లెల నీటి సంపదను శీతల పానీయాల కార్పొరేట్లకు దోచిపెడుతున్న ఈ ప్రభుత్వాలు దేశాన్ని ఏవిధంగా వెలిగిస్తున్నాయో చూపే రాజకీయ ప్రకటన ఇది. ఈ దగుల్బాజీ రాజకీయాల వల్ల పల్లెలకు ఎదురౌతున్న నీటి కష్టాలు కవి మాటల్లో చూడండి. “నీళ్లిప్పుడునగరం స్టోరేజ్ ట్యాంకుల్లో చేరి ఊరి చెరువుల ముఖం మీద కాండ్రించి ఉముస్తున్నాయి నీళ్లిప్పుడు పల్లెల్ని అపహాస్యం చేస్తూ పల్లె జనం గొంతుల్లో యాసిడ్ చుక్కలై ఎగతాళి చేస్తున్నాయి” ఎక్కడ నీళ్లు పుట్టాయో అక్కడే నీటి ఎద్దడి రావటం కార్పొరేట్ కంపెనీల, వాటికి వెన్నుదన్నుగా ఉన్న ప్రజా వ్యతిరేక లిబరల్ రాజకీయాల మహిమే అని బలంగా పలికించాడు.

ఈ దుర్మార్గ రాజకీయాలలో గ్రామీణ పీడిత కులాల పేదరికం మరింత దయనీయంగా తయారైన వాస్తవం ఈ కవి గుండెను పిండుతుంది. హాస్టళ్లు మూసినాక ఇళ్ళకొచ్చిన పేద బహుజన విద్యార్థుల క్షోభ అంతా ఇంతా కాదు. “పొంత కుండ పొయ్యిలో కచిక / పళ్ళమీద పారాడి / నిన్నటి గంజి బువ్వ వాసనని గురించి / మధురమైన కబుర్లు చెబుతోందని” వదిలేయకుండా విద్యార్థుల కోణంనుంది ఇంకా లోతైన పరిశీలన చేసిన వ్యక్తీకరణ షాక్ చేస్తుంది. “పొక్కిలి లేచిన వాకిలి లోపట పెచ్చులూడిన గోడపక్కన ముద్దుగా బజ్జున్న పుస్తకాలకు పట్టొద్దని చెదల్ని బతిమాలుకోవాలి ఛార్జీలకైనా డబ్బులు దాచమని పేకాడే నాయనని బతిమాలుకోవాలి కూలి తల్లి కమురంటిన ముఖాన్ని చూస్తూ పుస్తకాల్ని ముద్దెట్టుకోవాలి” స్వర్ణ భారతదేశంలో శ్రమ కుటుంబాల వాస్తవం ఇంత దుర్భరంగా ఉందన్నమాట. జీవితాన్ని పైపైన తడిమి చూసే వాళ్లకు అందని వాస్తవమిది. ఎండ కన్నెరగని సాథ్వీమణులకీ, సత్పురుషులకీ అంతుపట్టని, జీర్ణంకాని యతల్ని బహిర్గతం చేయడంలో ఈ కవి ఇంపాక్ట్ శక్తివంతంగా పడుతుంది: “ఓ సారి పల్లెలో పుట్టి వెలివేతల సలపరం చూడు ఒక్కసారి వెలివాడల తల్లుల చెల్లిగా పుట్టు. ఒకే ఒక్కసారి.. జోగినిగానో బసివినిగానో మాతంగి గానో ఊరి జనాల ఈలల మధ్య సిందెయ్” అని సవాల్ చేయడంలో ఉన్నదిదే. ‘నోళ్లు మూసుకుపోయిన బీడు నేలలూ, సత్యాన్ని సమాధి చేసి అబద్ధాలు’ పండించే వాతావరణంలో, ‘భాషల్ని చంపి గోసల్ని వెక్కిరించే నేల మీద ‘ ‘ఉన్మాది శాంతి గీతం’ వెక్కిరిస్తున్న వేళ కలుగుల్లో దాక్కోటం కరెక్ట్ కాదనీ, విపత్కర పరిస్థితుల్లో గుండె జారటం పరిష్కారం కాదనీ, మనుషుల్ని ప్రేమించే వాళ్ళు వ్యవస్థను మార్చడానికి పూనుకోవడం తప్పదనీ వాదిస్తాడు. సానుకూల శక్తులపట్ల చెరిగిపోని ఆశనూ ప్రకటిస్తాడు.

“నీడని చూసి మనిషిని ద్వేషించేవాళ్ళ మధ్య రాయిని చూపి దైవత్వాన్ని హింసించే వాళ్ళ మధ్య ఎవడో ఒకడు పసినవ్వులతో భూగోళానికి ప్రేమ రంగులద్దుతాడు “ఇలా “మసకేసిన మబ్బులున్నప్పుడు, గర్జించే ఉరుములున్నప్పుడు, చలించని గుండె నిబ్బరం తోడున్నప్పుడు బతికి ఉంటాం కదా”ఎక్కడో ఒక చోట పచ్చగా బతికే కాలముంటుంది గదా అనే భరోసాను ఇస్తాడు. ఇంతకు మించి సెన్సిబుల్ మానవులుగా మనల్ని మనం మానసిక మధనానికి గురిచేసుకునే స్పేస్ ను మిగుల్చుకోవాలనే ప్రజాస్వామిక ప్రతిపాదన చేస్తాడు. “నేమ్ ప్లేట్ కింద బందీ ఐపోకుండా మనస్సును రక్షించు కునేందుకు ప్రేమతో పలకరించు కొనేందుకుఒంటరిగా ఐనా సరే, మన తప్పులు మనమే తెల్సుకునేందుకు చెంపలు వాచేలా మనల్ని మనమే లెంపలు వేసుకునేందుకు ప్రి- ఆక్యుపైడ్ స్టుపిడిటీ నుంచి విముక్తి చేసుకునేందుకు దేనికైనా సరే కొంచెం స్పేస్ మిగిల్చుకుందాం” అని ఫ్రాంక్ గా పలుకుతాడు. చివరికి మనకేం కావాలో, తనకేం కావాలో కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతాడు. కంచెల్లేని దేశం, జనాన్ని విడగొట్టని దేశం కావాలని ప్రకటిస్తాడు. “మట్టి మనుషుల్ని అసహ్యించుకోని దేశం ముచ్చటగా మనిషి తీరుగా ఉండే ఒక దేశం కావాలి- – – – – – – -అమ్మలాంటి ఒక దేశం కావాలి” ఈ కల మన అందరిదీ. మనిషన్న ప్రతివాడిదీనూ. మద్దూరి నగేష్ బాబులోని పల్లె దళిత నుడికారం, raw emotions తో పాటు పైడి తెరేష్ బాబు లోని సొఫిస్టికేటెడ్ వ్యంగ్యం కలగలిసిన వ్యక్తీకరణ కనిపిస్తుంది రవి కవిత్వంలో. ఆ ఇద్దరి కవుల మేలు కలయిక ఈ కవి అంటే ఇంకా బాగుంటుంది. ఆ ఇద్దరు ఆగిన చోట ఈకవి మొదలయ్యాడు. మారిన వాతావరణాన్ని సరికొత్త సందర్భం నుంచి సరికొత్త పోయేటిక్ ఇడియంతో కవిత్వీకరిస్తున్నాడు. ఈ రకంగా చూసినప్పుడు అప్పటినుంచీ ఇప్పటివరకూ సాగిన సాగుతున్న చరిత్రను బహుజన కోణం నుంచి రవి కవిత్వం రికార్డ్ చేయగలిగింది.

చివరిగా ఒక మాట చెప్పాలి. విమర్శ, ఆత్మ విమర్శలతో సరిపెట్టుకున్న కవికాదు రవికుమార్. మానవ సంబంధాల మీదా, ప్రేమ మీదా హృదయాన్ని స్పర్శించగల కవిత్వమూ రాశాడు. బలమైన ముద్ర వేయగలిగాడు. “నువ్వు కోసుకెళ్లిన గడ్డిమోపులో నా వేళ్ళు కనిపిస్తాయేమో చూడు పడవ ఏడ్చినప్పుడూ రావుగెనాలకి చివర దిగాలు నవ్వు నాదేనని ఎప్పుడు తెల్సుకుంటావు” ఇట్లాంటి వ్యక్తీకరణలు ఇతన్ని నిండైన కవిగా నిలబెడతాయి. బహుజన ఈస్థటిక్స్ కు భరోసానిస్తాయ్. తన ఈస్థటిక్స్ ను పట్టిచ్చే మరో వ్యక్తీకరణ చూడండి. “అమ్మల చాకిరీ సిగన నిద్దరోయే సూరీడు అలికిన గోడల మీద ముద్దుగా వెలిగే సెంద్రుడు మట్టి అరుగుల మీద మురిసేనాము ముగ్గు సోయగం నువ్వెప్పుడైనా చూశావా?ముళ్ల చెట్ల తేమాతంగెడు పూల పరిమళం తుమ్మచెట్టు కొమ్మన వాగొడ్డున నిద్ర కలని నువ్వెప్పుడైనా కన్నావా?” మన గుండెల్లో ఇతను నిలిచిపోయే కవి అని నిస్సంకోచంగా చెప్పటానికి ఇంతకు మించిన ఉదాహరణలు అవసరం లేదేమో. నూకతోటి రవికుమార్ పుస్తకాన్ని ప్రచురించిన దుప్పల రవికుమార్ అభిరుచినీ, కమిట్మెంట్ ను అభినందిస్తున్నాను.

Please Post Your Comments & Reviews

Your email address will not be published. Required fields are marked *