కోరస్ కలుపుదాం రండి..

డాక్టర్ చింతపల్లి ఉదయ జానికి లక్ష్మీ

పని ఆనందమైతే జీవితం సంతోషమవుతుంది, పని బాధ్యతైతే జీవితం బానిసత్వమవుతుంది అంటూ మాక్సిమ్ గోర్కీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. నాకు డా. నూకతోటి రవికుమార్ రచించిన కంచెమీద పక్షి పాట చదువుతుంటే. ముందుగా వారికి అభినందనలు.

‘ఎగరగల పక్షులుంటాయి/ రెక్కలు కత్తిరించినా/ కరెంటు తీగలమీద స్వేచ్చాగీతం పాడుతూ / నడవగలిగిన పక్షులుంటాయి, ఎగరగల పక్షులుంటాయి/ మరణాన్ని వెక్కిరిస్తూ/ శత్రువుపై కత్తిదూసే నవలోకపు పక్షులుంటాయి…. అంటూ అనేక కంచెల్ని దాటుకుని వచ్చిన పక్షి పాటతో కలిసి కోరస్ కలుపుదాం రండి.
“కంచెమీద పక్షిపాట” 60 కవితలతో 120 పేజీల పుస్తకం ఇది. సాదాసీదాగా కనిపిస్తూనే నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును స్పందింప చేస్తూ, ఆలోచింపచేస్తూ, నడుస్తూ నడిపించటం, చదువుతూ చదివించడం, ప్రేమిస్తూ అమ్మలా ప్రేమించటం తెలియపరిచే కవిత్వ సంకలనం, అమ్మను హత్తుకున్నట్లుగా హత్తుకుందాం రండి. పుక్కిట దాగిన ప్రతి నిజాన్ని చేతుల్లో కాగడాగా వెలిగించి, కంచెల్లేని సత్యం వైపు అడుగులు వేస్తూ… సంకోచాలకు, మొహమాటాలకు తావివ్వక కలాన్ని కరవాలంగా మలుచుకుని కులమతాలకు బందీకాక సత్యం ముందు తలవాల్చిన కవిత్వ సంపుటి ఇది. అస్తవ్యస్తమైన మన దైనందిక అనుభవాలను, తన దైనందిక అనుభవాలతో చేర్చి, క్రమపద్ధతిలో పేర్చి, నిత్యం చిత్రహింసల కొలిమిలో కాలే బ్రతుకులతో రచయిత కాలుతూ… ప్రతి అక్షరంలో మానవత్వంపు పాటను పాడి వినిపించిన కవిత్వ సంపుటి.

“ఒక దేశం కావాలి” కవితలోని వ్యక్తీకరణలో నిజాలని పాతరేయని దేశం కావాలి , దళితులు మైనారిటీల గుండెల్లో కత్తులు గుచ్చని దేశం కావాలి, రైతు ఆత్మహత్యలు లేని దేశం కావాలి, అందర్నీ అందరూ ప్రేమించుకునే దేశం కావాలనే ఆకాంక్షతో పాడిని పక్షిపాట అందరినీ ఆలోచింపజేసింది.

అస్తవ్యస్తమైన మన దైనందిక అనుభవాలను, తన దైనందిక అనుభవాలతో చేర్చి, క్రమపద్ధతిలో పేర్చి, నిత్యం చిత్రహింసల కొలిమిలో కాలే బ్రతుకులతో రచయిత కాలుతూ…
ప్రతి అక్షరంలో మానవత్వంపు పాటను పాడి వినిపించిన కవిత్వ సంపుటి.

‘నాన్నల్లేని బిడ్డల కోసం’ కవితలోని వ్యక్తీకరణలో ఆధార్ గుర్తించని బిడ్డల దీనాలాపనను, నవలోకపు నాన్నల్లేని బిడ్డలు ఉంటారు అంటూ పితృ దినోత్సవం లేని పుట్టుక, పుట్టుకతో పొందే అగౌరవ సంకేతాలకై విలాపగీతం అలపించింది ఆ పక్షి.

“ఒక దేశం కావాలి” కవితలోని వ్యక్తీకరణలో నిజాలని పాతరేయని దేశం కావాలి , దళితులు మైనారిటీల గుండెల్లో కత్తులు గుచ్చని దేశం కావాలి, రైతు ఆత్మహత్యలు లేని దేశం కావాలి, అందర్నీ అందరూ ప్రేమించుకునే దేశం కావాలనే ఆకాంక్షతో పాడిని పక్షిపాట అందరినీ ఆలోచింపజేసింది.

“వెతుకులాట” కవితలోని వ్యక్తీకరణలో పుట్టలు పుట్టలుగా విస్తరించే నిరుద్యోగంతో తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి దొరకక, ఆధారపడే వ్యవసాయం ఆసరాగా ఉండక…పత్రికలు నిజాలు రాయక, కోర్టులు న్యాయాన్ని చెప్పవు అంటూ ఆక్రందనా గీతం వినిపిస్తుంది ఆ పక్షి. “ముసుగులు తొలగాల్సిన కాలం” కవితలోని వ్యక్తీకరణలో అస్తిత్వాన్ని భుజంపై మోస్తూ వివక్షను తరమాల్సిన కాలం, అలగాల్సిన కాలం కాదు అరవాల్సిన కాలం, సమూహ గానాన్ని విసరాల్సిన కాలం అంటూ… ముసుగులు తొలగింపజేసి అందరిచే సమూహ గానాన్ని ఆలపింప చేస్తారు రచయిత.

“మట్టికాళ్ల అమ్మ” కవితలోని వ్యక్తీకరణలో… మట్టికాళ్ల అమ్మ మధురమైన గంజి వాసన కొమ్మ మా అమ్మ అంటూ…కన్నతల్లిని, తల్లి లాంటి పల్లెను ప్రేమిస్తూ… ఉమ్మితో తుడుచుకునే పలక గుండీల్లేని చొక్కాలో మిగిలిన మిఠాయి అమ్మ కొసరే ముద్దు/ నువ్వు ఎప్పుడైనా చూసావా? అంటూ వేసిన ప్రశ్న తల్లిని తల్లి లాంటి పల్లెను మరచిన వారికి సూటిగా ఘాటుగా ఉంటుంది.

“రోహిత్ ఒక సర్వనామం”, “రోహింగ్యా దుఃఖం”, “మా మంచి అయ్యారు”, “వెన్నెల తాగిన నవ్వు” ఎన్నో కవితలు ఆణిముత్యాలు అని చెప్పవచ్చు, అంతేకాక సరిగమలు సరిగ్గా పలకని చీకట్లో బందీ అయిన గొంతులచే మధురగీతం ఆలకిస్తాడు రచయిత, ఈ కవితా సంకలనంలోని 60 కవితలతో అక్షరమాలను కట్టి బహుజనుల అభ్యున్నతికై, మైనారిటీల పక్షముగా బాధ్యత స్వీకరించి, లక్షింపేట దళితులపై దాడి వంటి అనేక అంశాలతో తన వేదనను పక్షిలా పాడి, తనలా పాడే పక్షుల గుంపుకు ఆ మాలతో అలంకరించాడు రచయిత.

తండ్రి సమానులైన డాక్టర్. మల్లవరపు రాజేశ్వరరావు గారి స్మృతిలో “ఎక్కడ ఎదురవుతారు సారూ” అంటూ…నా పొట్టలోపలికి చూసి కడుపు ఆకలి తీర్చే వాడు/ మా నాన్న లేని లోకంలోకి ఇంద్రధనస్సులా వచ్చిన వాడు అంటూ…తండ్రి వాత్సల్యన్ని కుమారుని అనురాగంతో అర్ధవత్వంతో రాసిన కవిత పాఠకునికి కనురెప్పలు తడిచేస్తుంది.

“మీ టూ”…! కవితలోని వ్యక్తీకరణలో ఎన్ని గుళ్ళల్లో మీ టూ అనాలో, ఎన్ని ఊళ్ళల్లో మీ టూ అనాలో, ఎన్ని సేలల్లో మీ టూ అనాలో…. మీలో మనం లేకుండా టూలో తనం లేకుండా స్త్రీ ల ఆత్మఘోషను, సముద్ర ఘోషతో సమానమైన శ్లోకంగా రచయిత గొంతుకతో పాడే కంచెమీద పక్షిపాట.

రచయిత మట్టి లోపల కలియతిరుగుతూ, మట్టిని నొసటన సింధూరంగా ధరించి, మట్టి మీద చెవొగ్గి జన్మ రహస్యాన్ని తెలుసుకొని, మట్టి బాస, శ్వాస, గోస వినే సాహసం చేసి వ్యక్తిత్వాన్ని కవిత్వాన్ని ఏకంచేసి, జీవితానుభవాన్ని ప్రత్యక్షంగా, సజీవంగా “కంచెమీద పక్షిపాట”గా మనందరికీ వినిపిస్తున్నాడు రచయిత.

మట్టి కలల తల్లుల పాదముద్రల్ని ముద్దాడి, ప్రాణాన్ని చిరునవ్వు చేసి బహుమతిగా ఇస్తూ…. “కంచెమీద పక్షిపాట” ఆలపించిన రచయితతో కలిపి కోరస్ పాడుతూ ….. అభినందన పూర్వకంగా “కోరస్ కలుపుదాం రండి”!

దళిత బాహుజనుల వేదనలు ఈ కవిత్వం నిండా పరుచుకున్న ట్లు కనపడినా లోతుగా చూస్తే మానవత్వంతో నిండిన కవిత్వం. మనిషి బతుకు గాయాల నెమరు ఈ కవిత్వం నిండా పరుచుకున్నదని చెప్పవచ్చు.ఈ సంపుటిలో ‘ఉన్మాది శాంతి గీతం’, ‘మృత్యు శీతల స్పర్శ’, ‘గాయాల కొలిమి’ కవితలు చాలా గాఢతతో ఉండి పాఠకుడిని ఆలోచింపచేస్తాయి. సమాజంలోని ప్రతి సమస్య, ప్రతి సందర్భం మీద బాధ్యతగా తన కలాన్ని తన గళాన్ని వినిపిస్తూ, అణగారిన జాతుల స్వయం గౌరవ ప్రకటనతో నిత్యం కరచాలనచేస్తూ … ముసుగులులేని మానవత్వపు ప్రకటన డా. నూకతోటి రవికుమార్ గారు “కంచెమీద పక్షిపాట” కవిత్వ సంపుటిని తల్లిదండ్రులకు అంకితమిచ్చారు.

అంబేడ్కర్ని ఆవాహన చేసుకొని ఆయన మార్గాన్ని కవితాగానం చేస్తూ ఆ మార్గంలో తాను నడుస్తూ, నలుగురినీ నడిపిస్తూ… సమాజంలో కంచెమీద పక్షిపాటై ఆ పాటను మనతో కూడా పాడిస్తూ, కంచెమీద పక్షిపాటతో కోరస్ కలుపుతున్నాం. డాక్టర్ నూక తోటి రవి కుమార్ గారు అందుకోండి… డా. చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి అందించు అభినందన పూర్వక శుభాకాంక్షలు…

COMMENTS

 • డాక్టర్ నూకతోటి రవికుమార్ September 28, 2020 At 3:55 am

  మంచి సమీక్ష చేసినందుకు ధన్యవాదాలు మేడమ్

 • చందలూరి నారాయణరావు September 28, 2020 At 5:13 am

  చక్కని విశేషాలు తెలిపారు…
  ఆసక్తికరమైన విషయాలు ఎంతో బాగా తెలిపారు..
  సాహిత్యాన్ని అభిరుచిగా కాకుండా…ఒక బాద్యతగా స్వీకరించిన ఉత్తమ సాహితి ప్రియులు మరియు కవియత్రి ఉదయ జానకి లక్ష్మీ గారికి అభినందలు..
  రవికుమార్ గారి మనసును తెలిపిన కవిత్వం వారికి మంచి పేరుతో పాటు
  మంచి సాహిత్యం అంటే ఏమిటో తెలిపిన వారి కృషికి శుభాకాంక్షలు…

 • Please Post Your Comments & Reviews

  Your email address will not be published. Required fields are marked *