ఉద్యమ కవిత్వం

– అనిల్ డానీ

కులమతాల గీచుకున్నట్టి గీతలజొచ్చి

పంజరాన కట్టువడను,నేను!

నిఖిల లోక మెట్లు నిర్ణయించిన గాని

తిరుగు లేదు,నాకు విశ్వనరుడ నేను

–గుర్రం జాషువా

మనుషుల పట్ల, వాళ్ళ అవమానాల పట్లా ఉండవలసిన పెయిన్ తగ్గిపోతుందమ్మా.. అందువల్ల ఎవరూ ఆ బాధలు మావే అని ఎంపతి చూపడం లేదు. తద్వారా అవమానాలా జాబితా ఎప్పటికప్పుడు సవరించబడి చివరికి పెరుగుతూనే పోతుంది. అని ఆవేదన చెందే ఉద్యమకారుణ్ణి ఎప్పుడయినా కలుసుకున్నారా..? ఎక్కడ ఏ సంఘటన జరిగిన బాధితుల పక్షాన స్టాండ్ తీసుకుని మాట్లాడే దళిత ఉద్యమకారుడిని పలకరించారా.. కంచె మీద నిలబడి లోపల జరుగుతున్న అక్రమాల మీద కన్నీటి పాట పాడుతున్న పక్షి పాట విందాం. ఆ పాట కవిత్వం ఆ గొంతు నూకతోటి రవికుమార్ ది. అతని తొలి కవితా సంపుటి కంచె మీద పక్షి పాట.

ఒకసారి చలాన్ని చదివి అర్ధం చేసుకుని, మరోసారి కొడవటిగంటి కుటుంబరావు మీద పిహెచ్డీ చేసిన వ్యక్తి తాలూకా భావజాలం ఎలా ఉంటుంది. అయితే మార్క్సిజాన్నో లేకపోతే, చలం భావజాలాన్నో ఇంకా డీప్ గా పోతే ఏ రమణ మహర్షి తత్వాన్నో వంటికి పట్టించుకుని ఈ పాటికి ఆ తత్వాలని పాడుకుంటూ తిరిగేవాళ్ళు ఇంకెవరన్నా ఐతే. కానీ రవికుమార్ అలా కాలేదు. తన మూలాన్ని మరిచిపోలేదు. నాన్న నూకతోటి కోటయ్య నేర్పించిన కమ్యూనిజం పునాదుల మీద చాలా కాలం నిలబడి వాస్తవాల వెలుగులో తనను తాను నడిపించుకుంటు చివరిగా అంబెడ్కర్ దగ్గర తన గమ్యాన్ని నిర్ధారించుకున్నాడు. మన కతలు ఎవరు రాస్తారు..? గుండెల మీద రవికగుడ్డే లేని మన తల్లుల కతలు ఎవరు రాస్తారు. అని దళిత బతుకుల కతలన్ని రాస్తాడు రవికుమార్. ఎవర్రాయాలి ఈ అణగారిన జీవన స్థితిగతుల్ని, గొంతు పెగలని చోట , మాట విప్పడానికి కూడా భయపడే చోట ఎవర్రాయాలి ఈ చరిత్రని. నాలుగు అక్షరాలు నేర్చుకుని నాలుగు మాటలు మాట్లాడగలిగి , నాలుగు రోడ్ల కూడలిలో గొంతును వింటిలా సారించి వాక్బాణాలని ఎవరు సంధించాలి.. ఎవరో ఒకరు లేస్తారులే అనే మనస్తత్వం కాదు ఈ కవిది. ముందు మనం మాట్లాడాలి అన్న దూకుడు ఉన్న మనిషి. అందుకే ఫ్యూడల్ వ్యవస్థను తిరస్కరిస్తూ తిరగేసిన పీట మీద రుచిగా మెరిసే ముడుసుల కతలు రాయమని కోరుకుంటాడు.. మేము విడిపోతాం ఒకర్నొకరం విచిత్రంగా ఎక్కిరించుకుంటాం.. అంటూ ఆవేదన వెళ్ల గక్కుతాడీ మనిషి. దళితులు ఏళ్లకు ఏళ్లుగా అణగదొక్కబడుతుంటే మళ్ళీ వీళ్ళలో వీళ్లే ఇంకోకళ్ళని కానివాళ్ల లాగా చూసే నైజాన్ని సమర్ధించడు.

రెండు ప్లస్ మూడు ఈజీక్వల్టు ఒకటి అన్న మద్దూరిని గురుచేస్తాడు చాలా చోట్ల. ఏం కావాలి దళితులకు, ఆత్మగౌరవం కావాలా, లేక రిజర్వేషన్లు కావాలా, చుండూరు , కారంచేడు, లక్షింపేట, నిన్నటికి నిన్న గరగపర్రుల్లో జరిగిన అవమానాలకు మందు కావాలా లేక వాళ్లలో వాళ్ళు కుమ్ముకోవడం కావాలా అన్న ప్రశ్న పెత్తందారీ వర్గాలలో నుంచి హేళనగా వినబడుతున్న రోజుల్లో, ఒక సిద్ధాంతాన్ని మోసుకు తిరిగే బాధ్యతగల వాడిగా రవన్న సావధానంగా ఒక్క మాట చెబుతాడు. మనం ఇప్పుడు మనువు మీద యుద్ధం ప్రకటించే గాఢమైన కలనీ కనాలని గుర్తు చేస్తాడు. అంబెడ్కర్ చెప్పిన సూత్రాలన్నిటిని పక్కన పెట్టి కేవలం ఆధిపత్యపు పోరు సాగిస్తున్న కొంతమంది కుహనా దళితవాదులకి ఈ మాటలు రుచించక పోవచ్చు కానీ నిలబడి కలబడితేనే మన సత్తువకి శత్రువు పారిపోతాడన్న నిజాన్ని మిగతవాళ్ళైనా గుర్తు చేసుకుంటే మంచిది. కవిత్వం కాదబ్బాయ్ నాకు నచ్చిన నాలుగు మాటలు ఇలా రాసుకున్నా అంటాడు కానీ దేన్ని కవిత్వం అనకుండా ఉండలేం. ఇప్పటికే మాట్లాడి మాట్లాడి పలచబడిపోయిన మాటలు, ఎక్కడా అలంకారాల తాలింపు ఘుమఘుమలు అంటని ముక్కుసూటి పదాలు, ఎక్కడా ఆగనివ్వని శైలి. సంపుటి నిండా ఒక్క చోట కూడా తనకున్న ఆగ్రహాన్ని తిట్లలో చూపించకుండా రాసుకున్న మాటలివి. కాకపోతే భావాల్లో భాస్వరం ఉండబట్టి అవి మిమ్మలని కూడా రగిలిస్తాయి.

“ఒక మాయలోడు టీ కప్పుతో సీఎం అవుతాడుగుజరాత్ నేలలోనుంచి ప్రవహించిన నెత్తురు, దేశం భూమి కింద అసహాయుల ఆక్రందన మూలుగుతూ ఉంటుంది.” ( ఉన్మాది శాంతి గీతం) కారణాలు , వివరణలు అక్కర్లేదు. పై మాటలు చూస్తే అర్ధమవుతుంది కదా రాజ్యం చేస్తున్న అక్రమాలకు పీడిత ప్రజల ఆక్రందన ప్రపంచం మొత్తం వింటుంది. ఇలాంటి మాటలు మాట్లాడినందుకే మనం మన దేశం లో ఒక అఖ్లాక్ ని కోల్పోయాం, ఒక గౌరీ లంకేశ్ ని పోగొట్టుకున్నాం, వరవరరావు, సాయి బాబాల జైలు గోడలు సందేశాల్ని మౌనంగా దుఃఖిస్తూ వింటున్నాం. ఇలాంటి సందర్భాల్లో కూడా కవిత్వమూ అందులో పరమావధి లేక అలంకార సమన్వయాలు చూస్తూ కూర్చుంటే కుదరదు . దేశాన్ని తగలబెట్టాలని చూసే తోడేళ్ళు గుంపు దురాగతాల్ని విప్పి చెప్పడం కూడా కవిత్వమే అవుతుంది. రవన్న అదే పాటించాడు. కలేకూరి చెప్పి పోయిన మాట “మనం రాస్తే ఎలాగుండాలి కంది మోడు కస్సున కాల్లో దిగినట్టు ఉండాలని” అన్నట్టు రవన్న దాన్నే ఫాలో అయ్యాడు. అదే ఈ పుస్తకానికి అతిపెద్ద బలం. నేరుగా సూటిగా పదాల మధ్యన ఎలాంటి మెరుపులు, విరుపులు ఆడంబరాలు లేకుండా రాయడం చాల శ్రమతో కూడుకున్న విషయం. అయినా రాయవలసిన విషయం లోపల రగులుతా ఉంటే రాసేప్పుడు నియమాలు ఏముంటాయి. రవికుమార్ లోలోన చాలా దుఃఖితుడు అతను బయట గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చినా లోలోపల మాత్రం చాలా నలిగిపోతున్న మనిషి కనబడతాడు. వర్తమానం చేస్తున్న అరాచకాల పట్ల చాలా దుఖః పడతాడు. ఈ సంపుటిని మొత్తం కనుక మనం పరిశీలనగా చూస్తే గత ఒకటిన్నర దశాబ్దం కన్నీరు మొత్తాన్ని ఒకేచోట చూసిన భావన కలుగుతుంది. అందునా దళితులకు ఈ మధ్య కాలంలో అయిన గుండె గాయాలు లెక్కలేనన్ని అవన్నీ రవన్నని కదిలించాయి, బాధించాయి.

తన తలపోతలో ఇలా రాసుకుంటాడు ఒక కవితలో ” చుండూరు ఒక ఫీనిక్స్ పక్షి పాడే పాట ఓడిపోయిన వేకువ నమ్మకం కోసం సాచే హస్తం చేతుల్లో కరవాలం లేనివాళ్ళు తిప్పే యుద్ధం తాలూకు స్పర్శ. ఇదొక పెనుసవాలు.” బతకడం పెను సవాలు గా మారినచోట పాట పాడడానికి పక్షులు మాత్రమే మిగిలి ఉంటాయని గురుచేస్తాడు. మనం ఒక వ్యక్తిగా ఈ సంపూటాన్ని చదివేటప్పుడు చాలా సందేహాలు ముసురుకుంటాయి. అయితే ప్రతీ కవిత సమాజానికి అన్వయం చేస్తూ ఎన్నుకున్న వస్తువు వాస్తవమైనది కావడం వలన అది సామూహిక ప్రయోజన కవితగా మారుతుంది. ప్రతీ పాదం లోను రాజీ లేకుండా ప్రభుత్వాన్ని దాని దమనకాండను జంకు లేకుండా విమర్శించడం వల్లకూడా మనం ఈ శైలి కి అలవాటు పడిపోతాం. పుట్టిన మట్టిమీద నమ్మకం ఉన్నవాడు. భూమిని యుద్ధ రంగంగా దురూహ చేస్తున్నప్పుడు ఆ భూమిని బువ్వ పెట్టె అమ్మగా పోల్చుకుంటాడు. రవన్న మరో చోట “ఈమెతో స్నేహం చేయాలని ఉంది” అంటాడు ఈ ఈమె ఎవరు అనాదిగా దళితుడిని ఐదో వర్ణంగా చూస్తూ అణగదొక్కిన ఆమెనేనా లేక మూలాలని మరిచిపోయి పక్కవాడిని హీనంగా చూస్తూ వాళ్లలో కూడా ఉండేవి రక్త మాంసాలే అని గుర్తించని కండకావరపు ఉన్నత వర్గాన్ని ఈమె తో పోలుస్తున్నాడా అని రెండు మూడు సందేహాలు వస్తాయి. ఏదయితేనేం ఆమెతో చిటికిన వేలు పట్టుకుని వాడంతా కలియదిరగాలని వాడకట్టుని చూపించాలనే ఆశ మాత్రం ఎన్నదగింది.

ప్రతీ రోజు ను సెలబ్రేట్ చేసే ఈ పెట్టుబడి దారి ఆర్ధిక వ్యవస్థలో రవన్న పితృదినోత్సవాన్ని జరుపుకోలేని పిల్లలని అక్కున చేర్చుకుంటాడు. స్వచ్ఛ భారత్ నినాదం కింద నలిగిపోయిన మున్సిపల్ కార్మికుల దీన గాధల్ని మనకి చూపిస్తాడు. ఈ క్రమంలో చాలా కఠిన వాస్తవాలు మనకి కనబడతాయి. చదువు చెప్పిన బడిని మరో అమ్మ అంటాడు. నాలుగు అక్షరాలు నేర్చుకోవాలి అని అంటూనే ఖాళీ పళ్ళాలో కాసంత సాంబార్ కూడు కూడా కోరుకోవాలి అంటాడు. ఇదంతా వెనుకబాటు తనం మీద పెరిగి వచ్చిన ఒక ఉన్నత విద్యావంతుడి మాటలు. అందుకే తన బాధలన్ని సముద్రంతో చెప్పుకుని సముద్రమా నన్ను ఏదో ఒకటి చేసెళ్ళు అని వాపోతాడు. ఏం చేస్తుంది సముద్రం మాత్రం తాను కూడా నీతో పాటు నల్లని దానినే అని గొంతు కలిపి కొరస్ పాడుతుంది. అంతిమంగా మాట్లాడ్డం ఒకటేనా విరుచుకు పడుతున్న రాజ్యం మీదకు పోవాల్సిన దారిని ఎక్కడా డిఫైన్ చేయక పోవడం ఒక ప్రధాన లోపంగా చెప్పుకోవచ్చు. ఉద్యమమా లేక తిరుగుబాటా లేక అనునయిస్తూ చెప్పుకుంటూ పోయి మన హక్కుల్ని సాధించుకోవడమా అన్నది ఇంకాస్త గట్టిగా చెబితే బాగుండేది.రవన్న స్నేహశీలి. డప్పు ప్రకాష్ అన్నను, మద్దూరిని , శివసాగర్ ను, తెరేశ్ బాబును క్షుణ్ణంగా చదువుకున్న వాడు. కలేకూరి మీద విపరీతమైన ప్రేమ ఉన్నవాడు. ఎవరూ పట్టించుకోని సమయం లో తమ్ముడు తంగిరాల సోని తో కలిసి కలేకూరి వర్ధంతి జయంతులని తప్పిపోకుండా జరిపించిన వాడు. అందరూ ఏదో ఒక వంక పెట్టి కలేకూరిని మాటలు అంటే రవన్న మాత్రం ముద్దుగా “పాన పెదాలోడు” అన్నాడు. వెనక కారణాల్ని అన్వేషించే సమయమూ తీరిక ఇప్పుడు లేవు కానీ మనిషిని అతను చెప్పిన మాటని, అతను చూపిన మార్గాన్ని మాత్రం పట్టుకోవాలి అంటే కుదరదు, ముందుగా వ్యక్తిగా కూడా తనను మనం ఆమోదించాలి అది పాటించిన వాడు రవన్న. అందుకే కలేకూరి ని తెలుగునేలకి కొత్తగా పరిచయం చేసాడు. కాన్షీరాం పోరాట జీవితాన్ని పుస్తకం చేసిన చెన్నన్నను చేయారా అక్కున చేర్చుకుంటాడు. దళిత స్త్రీ ‘ఎమెలప్ప’ని చూసొద్దాం అనే కవితలో మొత్తం దళితవాడల సంభాషణ అంతా ముచ్చట గొలిపేలా రాస్తాడు. ఎవరూ పట్టించుకోని టీ బంకుని గుర్తు చేసుకుంటాడు. రోడ్డు పక్కన టీ దుకాణాలు వడపోతల వగపోతల సమ్మేళనా కేంద్రాలు అని కొత్త భాష్యం చెబుతాడు.

ఇవన్నీ కాక తాను అమితంగా ఇష్టపడే “రాజేశ్వరరావు” మాస్టారుని కోల్పోవడం కూడా రవన్నని చాలా కలవరపాటుకు గురిచేసింది. ఆయన చనిపోయాడని నాకెవరూ చెప్పకండి అంటూ రోదన చేస్తాడు. వాళ్ళిద్దరి సాహిత్య సాహిత్యేతర జీవన ప్రయాణం అలాంటిది. ఈ సంపుటి లో కవితల్ని ఒక చోట చేర్చే పనిలో రాజేశ్వరరావు గారి అబ్బాయి , కవి, మల్లవరపు ప్రభాకర్ రవన్నకి సాయం చేశారు. దళిత సాహిత్య మొత్తాన్ని చదివి వంట బట్టించుకున్న రవన్న తన కవితా సంపుటిలో మాత్రం ముందు తరం కవుల యొక్క శైలిలో లేకపోవడం కాస్త ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా కవితలు అన్యాపదేశంగా చెప్పుకుంటూ పోతునట్టే అనిపిస్తాయి. వర్తమానాన్ని కచ్చితంగా రికార్డు చేయాలన్న తపన కనబడుతుంది. ఒకటో రెండో ఒంగోలు ఇడియంలో రాసిన మాటలు కనబడతాయి తప్పా ఆ ప్రాంతపు నుడికారాన్ని ఎక్కడా గట్టిగా పట్టుకోలేదు. చాలా కవితల్లో టైటిలోనే కవితలో ఏం చెప్పదలుచుకున్నాడో తెలిసిపోతుంది. కాని చాలా కవితల్లో ఉండే శబ్ద సౌందర్యం పాఠకుడిని పట్టుకుని నడిపించుకు వెళ్తుంది. ఎక్కడా వస్తువు రిపీట్ అయిన సందర్భం కనబడదు. కొన్ని వాక్యాలు రిపిటేషన్ గమనిస్తే బాగుండేది.

సాధారణంగా దళిత కవిత్వం లో ప్రాథమిక లక్షణంగా ఉండే నిడివి ఇందులో చాలా తక్కువ. ఎక్కడా దూషణలు లేదా మితిమీరిన పద ప్రయోగాలు లేవు. అదొక ఊరటగా భావిస్తే, కొంతమందికి అదే ఒక ప్రధాన లోపంగా కనబడే చాన్స్ ఉంది. వర్తమానపు జీవితాల్లో అందరం బందీలుగా మారి కెరీయర్ల ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు రవన్న ఒక్కడే నిలబడ్డాడు. కొత్తగా వస్తున్న గొంతుకలకి ఒక వేదిక ఇచ్చాడు. “బహుజనులు రచయితల వేదిక” (బరవే)ని పెట్టి ఎన్నో పుస్తకాలని ఒంగోలు మరియు ఇతర ప్రాంతాలలో సభలు పెట్టాడు. జానుడి అనే ఒక సాహితీ సంస్థను విజ్ఞాన కేంద్రంగా నడపడంలో తనవంతు బాధ్యతను మోస్తున్న వాడు. విశాలాంధ్ర నుంచి నేటి సాక్షి వరకు జర్నలిస్ట్ గా చేసినా తన వాడిని వేడిని వదులుకోలేని వాడిగా చాలా సార్లు మాట పడ్డాడు కానీ వెనక్కి తగ్గలేదు. అంబెడ్కర్ ని సామాజిక మాధ్యమాలలో యువకుల మెదళ్లలోకి ఎక్కించిన ఘనత కొంత రవన్నకి దక్కుతుంది. అట్ట వెనక రాసిన నాలుగు మాటలు బాగున్నాయి. సిక్కోలు బుక్ ట్రస్ట్ చాలా శ్రద్ధతో ఈ పుస్తకాన్ని తెచ్చింది. ఇందులో నేను స్పృశించని అంశాలు ఇంకా అనేకం ఉన్నాయి. మీరు పుస్తకాన్ని కొని చదవండి. ఇంకా రవన్న దగ్గర నుంచి రావాల్సిన కవిత్వం బాకీ ఉంది. ముఖ్యంగా వర్తమానపు ‘పెయిన్’ మీద ఉన్న అభిప్రాయాలు అన్ని కలిపి కూడా వ్యాసాల సంపుటిగా తెచ్చినా దళిత పిల్లలకి ఉపయోగమే. “కుల మతాల కింద బందీ కావడం అసహ్యం నాకు. వీటిని మించిన మహనీయత ఒకటి లోకాన్ని సైన్స్ దీపంతో వెలిగిస్తుందని ఘాట్టిగా నమ్ముతాను” అని రాసుకున్న రవన్న మాటలు అప్పుడెప్పుడో జాషువా రాసుకున్న మాటల్లానే వినబడతాయి.

ఫేస్ బుక్ లో ‘కవిసంగమం’ శీర్షికలో కవితా….ఓ…కవితా…37 గా ఈ పరిచయం సెప్టెంబర్ 10, 2020 న ప్రచురితం అయింది.

Please Post Your Comments & Reviews

Your email address will not be published. Required fields are marked *