విభిన్న యోచనా తీరుకు నిలువుటద్దం ‘లోచన’

– పేరూరి మురళీకుమార్

1990 రెండవ అర్థ దశకంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చల్లపల్లి స్వరూపరాణి చదివే కాలంలో రాంనగర్ లోని బహుజన రిపబ్లికన్ పార్టీ కార్యాలయానికి తరచుగా వస్తూ శివసాగర్ తో సాహిత్య విషయాలతో పాటు అనేక విషయాలపై మాట్లాడుతుండే వారు. ఏకలవ్య పత్రిక తీసుకువచ్చేందుకు మేము శివసాగర్ తో కలసి పనిచేస్తుంటే ఈమె సాహిత్యపరంగా తన సహకారాన్ని అందిస్తుండేవారు. శివసాగర్ సాహిత్యానికి అమితమైన అభిమాని.. అప్పటినుండీ స్వరూపారాణి సుపరిచితులు. శివసాగర్ అమరులైన తర్వాత కూడా అనేక కార్యక్రమాల్లో మేము కలసి పని చేస్తూనే ఉన్నాం. అప్పటి నుండి ఈనాటి వరకూ మంచి సాహితీ ప్రకాశంతో వెలుగొందిన తీరు అద్భుతమైనది. మరోవైపు తన విద్యలో గణనీయమైన విజయాలను అందుకుని నాగార్జున యూనివర్సిటీలో బుద్దిస్ట్ స్టడీస్ విభాగంలో ప్రొఫెసరుగా వ్యవహరిస్తూనే సాహిత్య రంగంలో, సామాజిక, రాజకీయ రంగాల్లో తన అభిప్రాయాల్ని సూటిగా, స్పష్టంగా వెల్లడిస్తూ ఈనాటి తరానికి ఒక దిక్సూచిగా సరైన దిక్కుకు దారి చూపే మార్గదర్శకురాలిగా ముందుండడం మనం రోజూ గమనిస్తూనే ఉంటాం.

బహుజన రచయితల వేదికతో మా సామాజిక, రాజకీయ, సాహితీ ప్రయాణం మరింత బలపడింది. కేవలం తన ఉద్యోగాన్ని తాను చేసుకుంటూ సొంత కుటుంబానికే పరిమితమైపోతున్న నేటి అత్యధిక శాతం ఉద్యోగస్తులకు భిన్నంగా సామాజిక బాధ్యతని తన భుజానికెత్తుకున్న భిన్న చైతన్య శీలి స్వరూపరాణి. సిక్కోలు బుక్ ట్రస్ట్ నుండి ఆమె ఇటీవల ప్రచురించిన బహుజన వ్యాసాల సంకలనం “లోచన“. ఇందులో 31 వ్యాసాలను సంకలనం చేశారు. ఈ ముప్పై ఒక్క వ్యాసాలూ ఆమె భిన్న ఆలోచనల సమాహారం. ఆమె విభిన్న యోచనా తీరుకు నిలువుటద్దం. ఏ సామాజిక కదలికా లేని మనుషులు ఈ పుస్తకాన్ని చదివితే నిశ్చలంగా ఉన్న వారి మనసులో ఒకొక్క వ్యాసాన్ని విసురుతూ అనేక ఆలోచనా తరంగాల్ని సృష్టిస్తుంది. స్తబ్దుగా ఉన్నమెదళ్లలో అనేక ప్రశ్నల్ని మొలిపిస్తుంది. నిస్సత్తువుగా ఉన్న వారి శరీరాల్ని సత్తువుతో నింపి శక్తిమంతులుగా మారుస్తుంది. అమోఘమైన తన సాహితీ నైపుణ్యంతో మన కళ్ళకు సరికొత్త చూపునందిస్తుంది. కులమూ, మతమూ, జాతీ, లింగభేదాలతో కునారిల్లే ఈ నికృష్ట సమాజానికి ఒక ఆక్యుపంక్చర్ వైద్యురాలిలా శాస్త్రీయమైన శస్త్ర చికిత్స చేస్తుంది. బాబాసాహెబ్ అంబేడ్కర్ చూపుడు వేలినుండి మండే సూర్యుణ్ణి ఉదయింప చేస్తుంది.

సాహిత్య, సినీ రంగాల్లో పేరుకుపోయిన మూస భావ వ్యాప్తికి భిన్నంగా నేడు వస్తోన్న పలాస, కాలా, కబాలి వంటి సినిమాల్లో ఆవిష్కృతమౌతున్న దళితవాద , దళిత స్త్రీ వాద ధోరణులను అమాంతం పట్టుకుని మనముందు సజీవంగా ఆవిష్కరిస్తుంది. బౌద్ధంలో గాని, ప్రత్యామ్నాయ సంస్కృతిని గాని ఎక్కడ వీక్షించినా వాటిని మన గుండెల్లో ఆవిష్కరిస్తుంది. రాజ్యానికి, సమాజానికున్న పితృస్వామిక మనస్తత్వాన్ని ఏ రంగులూ పులమకుండా ఉన్నపళంగా మనముందు గోడకుర్చీ వేయిస్తుంది. తన కళ్లముందు ఒక నిర్భాగ్యురాలిని దేవదాసి పేరుతోనో, బసివి పేరుతోనో, మురళి పేరుతోనో ఆమె జీవితాన్ని సర్వనాశనం చేస్తుంటే కళ్లప్పగించి చూసే దేవుని విగ్రహం ఏమీ చేయలేక పోతుంటే ఆ దేవుడు లేడనేగా అర్ధం అని నిగ్గదీస్తూ దేవుళ్ళని బహిష్కరించమనే పిలుపునిస్తుందీ సంకలనం.

ఈ సంకలనం అందరికన్నా మాకు ఇంకా ఎక్కువగా అనుబంధాన్ని పంచింది. ఈ విషయం చదివిన తర్వాతనే బాగా తెలిసింది. ఎందుకంటే ఈ సంకలనంలో షేక్ మసూద్ బాబా గురించిన వ్యాసం ఉన్నది. సత్యమూర్తితో పాటు పరిచయమైన బాబా మాకు అందరికీ అత్యంత ఆప్తుడు. పెద్దదిక్కు. సత్యమూర్తి తర్వాత మేము అంతగా అభిమానించిన వ్యక్తి బాబా. ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూ “సత్యమూర్తి ఉద్యమ వారసులతో ఏర్పడిన సంస్థ సామాజిక న్యాయ పోరాట సమితి” అని ప్రస్తావించడం ద్వారా స్వరూపరాణి మాకు ఆకాశమంత విశాల హృదయంతో కనిపించారు. ఈ పుస్తకానికంతటికీ ఆ ఒక్క వాక్యంతో ఆకాశమంత ఎత్తుగా మాకు కనిపించారు. ఒక వ్యక్తినిగాని, ఒక పరిణామాన్ని గాని, ఒక సంస్థ కార్యకలాపాల్ని గాని గుర్తించక పోవడం అనేది ఆధిపత్య సంస్కృతి. గుర్తించడం అనేది శ్రామిక సంస్కృతి, బహుజన సంస్కృతి, నిజమైన బహుజన రచయితల సంస్కృతి. అటువంటి ప్రజాస్వామిక సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా స్వరూపరాణి నిలిచి ఆదర్శ ప్రాయమయ్యారు.

ఇక ఈ పుస్తకాన్ని ఎంతో అందంగా, గంభీరంగా తీసుకు వచ్చిన సిక్కోలు బుక్ ట్రస్ట్ కు ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేం. ఉత్తరాంధ్ర ను కళింగాంధ్ర అని సంబోధించాలనీ, కళింగాంధ్ర సంస్కృతిని పరిరక్షించాలనే సంకల్పంతో ముందుకు నడుస్తోన్న రవికుమార్ మాకు ఎప్పటికీ ఆప్తులే. అందరూ తప్పక చదవాల్సిన పుస్తకమే కాదు ఎప్పటికీ మనదగ్గర భద్రపర్చుకోవాల్సిన ఒక చారిత్రక డాక్యుమెంట్ కూడా ఈ సంకలనం!!

Please Post Your Comments & Reviews

Your email address will not be published. Required fields are marked *