ఆధిపత్యంపై కత్తి దూసిన ‘కంచెమీద పక్షిపాట’

బిల్ల మహేందర్

కుల మతాల కింద బందీ కావడం అసహ్యం నాకు. ఆధిపత్యం ఎదుట నిలబడి చేతులు కట్టుకుని నిలబడడం అసహ్యం నాకు. ఇంట్లో వంట్లో లేని ప్రజాస్వామ్యాన్ని సాహిత్యంలోకి చులాగ్గా ప్రవేశించి నిర్లజ్జ గౌరవాలు అందుకోవడం అసహ్యం నాకు. సత్యం ముందు తలవాల్చేవాళ్ళు ఎముకల్లో శబ్దమై మోగుతూనే ఉన్నప్పుడు వాళ్ళ పాద ముద్రల్ని ముద్దాడటానికి ప్రాణాన్ని చిరునవ్వు చేసి బహుమతిగా ఇవ్వడానికి ఎదురుచూస్తాను.

అంటాడు డాక్టర్ నూకతోటి రవికుమార్. పై వాక్యాలను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే తన పయనం ఎటు వైపో మనకు స్పష్టంగా అవగతమవుతుంది. బహుజన దృక్పధంతో సమాజంలోని వివిధ సంఘటనలపై ఎప్పటికప్పుడు తన అక్షరం ద్వారా స్పందిస్తూ రాసుకున్న కవితలన్నింటినీ కలిపి ఇటీవలే కంచెమీద పక్షిపాట అనే కవితా సంకలనాన్ని వెలువరించారు. “ఎగర గల పక్షులు ఉంటాయి / మరణాన్ని వెక్కిరిస్తో / శత్రువు పై కత్తి దూసే / నవలోకపు పక్షులుంటాయి / గుర్తించే కళ్ళు లేక / కునారిల్లే మనుషులుంటారు“.

ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వం ఉన్నవారు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడగలుగుతారు. మరణం అంచున వ్రేలాడుతున్నా సరే వారి ధిక్కారం కొనసాగుతూనే ఉంటుంది. వారి రెక్కల్ని కత్తిరించిన, బంధించిన బోనులను ధ్వంసం చేసి కరెంటు తీగల మీద స్వేచ్ఛాగీతం పాడుతూ చిరునవ్వుల సంతకాలు చేస్తారు వాళ్ళు. కాకపోతే వారిని గుర్తించే మనుషులు కావాలంటారు రవికుమార్. అందరూ రాయగలుగుతారు. ఏదో ఒకటి రాయగలరు. కానీ ఆ రాతలో స్పష్టత, ఓ చూపు ఉండాలి. ఏది పడితే అది రాస్తే దానికి ఏం ప్రయోజనం ఉంటుంది?? రాస్తున్నప్పుడు అడ్డుపడుతున్న ముళ్ళను, రాళ్లను ఏరి పారేయాలి. గడ్డిని, గరిక పొదను తొలగించాలంటాడు కవి. “దుక్కి దున్నినట్టు/ బీళ్ళను చుట్టి ముట్టినట్టు/ చెట్లూ చెలకలు కొట్టి/ ఎగుడు దిగుళ్ళ నేలను చదును చేసినట్టు/రాయడం చేతనవ్వాలని” (నడక నేర్చుకుందాం) అంటాడు.’దళిత మైనారిటీ గుండెల మీద ఇప్పటి సామూహిక యుద్ధం పేరు దేశభక్తి’ అంటాడు ఈ కవి. ఒక తోడేళ్ళ గుంపు కాషాయం వేసుకుని ఉన్మాది శాంతి గీతం ఆలపిస్తోందనీ, నాకు బువ్వపెట్టే భూమిని వాడు యుద్ధరంగంగా దురూహ చేస్తున్నాడంటూ “పసి పాదాలకు భూమివ్వని దేశం / చిరునవ్వులకు నీడనివ్వని దేశం / మట్టి స్వరాలకు చెవొగ్గని దేశం / శిథిలాల మీద కాషాయం ప్రవహించాలనే దేశం“(మట్టి పులకలు) ఇవాళ గొప్పదిగా చలామణి కావడాన్ని ఏ చరిత్ర క్షమించదని ఆగ్రహిస్తాడు. అందుకే తనకొక దేశం కావాలంటున్నాడు. ఆ దేశంలో దళిత, మైనారిటీ, పేద వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తున్నాడు. వారంతా ఒక స్వేచ్ఛా జీవనం కోసం ‘కంచెల్లేని దేశం కావాలి’ అంటూ నినదిస్తూ “నిజాల్ని పాతరేయని దేశం / శంభూకుడి, ఏకలవ్యుడిని చంపని దేశం / రైతు ఆత్మహత్యలు లేని దేశం / మెదళ్ళలోకి మతోన్మాదం లేని దేశం” (ఒక దేశం కావాలి) కావాలని కలలు కంటున్నాడు.

ఈ కవికి దేశమే కాదు, దేశమ్మీది మట్టి అంటే ఎనలేని ప్రేమ. మట్టిని ముట్టుకోని వాడు, మట్టి చెప్పే కతలను, వెతలను, మట్టి శోకం విననివాడు ఎవడైనా దేశద్రోహి కిందనే లెక్క కడతాడు. మట్టి విలువ తెలుసుకోవాలంటే ముందు మట్టితో మాట్లాడు అంటూ, దానిని ‘నొసటి సింధూరంగా ధరించమని’ చెబుతాడు. “పోరా…పో / చల్లని మట్టిలో / చెప్పు లేని కాళ్లతో కల దిరుగు / మట్టి మీద చెవొగ్గి / నీ జన్మ రహస్యం విను” (దేశభక్తి) అంటూ మట్టిని ప్రేమించడం అంటే అంత సులువు కాదు, మట్టి తల్లిగా పుట్టు, మట్టి బాస, శ్వాస, గోస వినే సాహసం చేయమని మట్టి ప్రాముఖ్యతను చెబుతాడు. అలా చెబుతూనే మట్టి మీద ప్రేమను నటించే వాళ్ళు హెచ్చరిస్తూ “భూమిని తల్లి అంటూ / భూమి బిడ్డల్ని వంచించే వెధవలు లేకుంటే బాగుండు / తులసిని పూజిస్తూ అడవిని ధ్వంసం చేసే వాడి గుండెల్లో / గునపం దిగితే బాగుండు” (బాగుండు) అని ఆక్రోశం వెలిబుచ్చుతాడు.’ఈమెతో స్నేహం చేయాలని ఉంది’ అనే కవితను కవి మలిచిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ఎండ ఎరుగని ఓ సాథ్విని పల్లెల్లోకి చిటికెన వేళ్ళతో పట్టుకొని నడిపించి లోకం బతుకును చూపాలని, ఆమె కప్పుకున్న చెంగును, దిద్దుకున్న తిలకం సృష్టించిన చేతుల్లోని రేఖలు ఇంకా మారనే లేదని చెప్పే ప్రయత్నం విభిన్నంగా ఉంది. “ఎండకన్నెరుగని సాథ్వీ… / ఓసారి పొలంలో కలుపు తీయ్ / ఎర్రటి ఎండల్లో కుప్పనూర్చు / పరిగె చేలో నిలబడి చెంగు చాపి / గింజలకోసం అర్థించు / ఓసారి పల్లెలో పుట్టి / వెలివేతల సరపరం చవిచూడు / ఒక్కసారి వెలివాడల తల్లుల చెల్లిగా పుట్టు / ఒకే ఒక్కసారి జోగిని గానో, బసివిని, మాతంగిగానో / ఊరి జనాల ఈలల మధ్య సిందెయ్” అంటూ పల్లెలోని ఆడబిడ్డల కష్టాలను, ఆధిపత్య కులాల మధ్య వెలివేయబడ్డ బతుకులను, అవమానాలతో పాటుగా ఇప్పటికీ చెలామణీ అవుతున్న దురాచారాల వ్యవస్థను బట్టబయలు చేస్తాడు. అదేవిధంగా ‘డొంకదారి’ కవిత కూడా చాలా భిన్నంగా సాగింది. ఒక్కోసారి కవి పాఠకులకు తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో తెలియజేయడం కోసం ఒక కవితను ఎలా నిర్మించి ముగించాలో ఈ కవిత ద్వారా మనం స్పష్టంగా చూడొచ్చు.

ముళ్ళుండొచ్చు/ రాళ్లుండొచ్చు/ చెల్లాయ్… అడుగు జాగ్రత్త” అంటూ ప్రారంభించిన ఈ కవిత చివరికి “చెల్లాయ్…/ అన్నిటికన్నా నువ్వు జాగ్రత్త/ నీ నవ్వు జాగ్రత్త” అని ముగిస్తాడు. ఈ కవితలో చెల్లాయితో సంభాషిస్తూ పాముండొచ్చు… పురుగుండొచ్చు…నీ చూపు జాగ్రత్త, మట్టికి మనిషికి ప్రాణం పెట్టే మన అమ్మా నాన్న జాగ్రత్త, గుడిసె, ఊరు, వాడ, పిట్ట, బతుకు జాగ్రత్త అని చెబుతూ చివరికి ‘అన్నిటికన్నా నువ్వు జాగ్రత్త’ అంటూ అసలు విషయం చెప్పే ఆలోచన చేయడం బాగుంది.అమ్మంటే ఇష్టం లేనిది ఎవరికీ?? అమ్మ కోసరే ముద్దు అదొక అద్వితీయ అనుభూతి. కవికి అమ్మంటే వెలిగే సెంద్రుడు. తంగేడు పూల పరిమళం. బతకడం ఒక యాతనైనప్పుడు అమ్మలుంటే చాలు/ అమ్మలుంటే చాలు/ ఎన్ని అగర్తలైనా/ ఆ ఒక్క అంగలో దాటేయలేమా?? (మట్టికాళ్ళ అమ్మ) అని అంటాడు. నిజమే ‘లోకాన్ని గెలిపించి ఓటమిని వ్యక్తీకరించే తల్లులు ఉన్నంతవరకు భవిష్యత్తు వాళ్ళ పాద ధూళిని రాసుకుంటూనే ఉంటుంది’. ‘మా మంచి అయ్యోరు’ కవిత బడి ఎగ్గొట్టే పంతుళ్ళ చెంప పగలగొట్టినట్లుంది. ‘అయ్యోరు సానా మంచోరమ్మా , అసలే బడి ఎగ్గొట్టి క్లాసులో మాట్లాడరు, ఎవర్ని ఎగతాళి చేయరు, పుస్తకాలు ఇస్తారు, నోట్సు ఇస్తారు, కలిసే తింటారు, కలిసే ఆటలాడుతారు, వీరంతా నా బిడ్డలే అంటూ కన్నీరు పెడతారు‘ అని ఒక ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలను అంతర్గతంగా చెబుతూ “మా అయ్యోరే మాకు దైవం/ దెయ్యాలంటే ఏంటో మాకు తెల్దు/ వాళ్ళు బడి ఎగ్గొట్టే వాళ్ళు కావొచ్చు” అంటూ ముగించి ఉపాధ్యాయులకు ఒక మార్గనిర్దేశకత్వాన్ని ప్రభోదిస్తాడు. అంతేగాకుండా బడిని ‘శాపాల శిశిరాన్ని నిరసనగా తన్ని/ కోట్లాది లోగిళ్ళు ఆత్మగౌరవంతో ఊరేగే మా తల్లి/ మా బానిసత్వం మాపే అద్భుత ద్వీపం/ వెట్టి కథల లోగుట్టు విప్పి చెప్పే విముక్తి మార్గం మా బడి” (బడే మా మరో అమ్మ) అని వర్ణిస్తూ అందరికి వెలుగెత్తి చాటి చెప్తాడు.

కాలాన్ని గురించి చెబుతూ “ఇది నడవాల్సిన కాలం / ఎవరో నడిపించిన నడకని / పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన కాలం / ఒంటి నిట్టాడులు నిటారుగా నించుని / సమూహంగా విసరాల్సిన కాలం / వడగాల్పుల మధ్య నిలబడి / మనువుమీద వడిసెల విసరాల్సిన కాలం / కులాన్ని నెట్టేసి దుఃఖాన్ని పేనేయాల్సిన కాలం / అస్తిత్వాన్ని భుజమ్మీద మోస్తూ /వివక్షతను తరమాల్సిన కాలం / స్వగతాల్ని జెండా చేసి / గతాల నెత్తుటి కాల్వల్ని పూడ్చే కాలమే కానీ / అలగాల్సిన కాలం కాదు / ఇది అరవాల్సిన కాలం” (ముసుగులు తొలగాల్సిన కాలం) అని పీడిత జనాలకు బాధ్యతను గుర్తు చేస్తూ వారిలో ధైర్యాన్ని నూరిపోస్తాడు. ‘మీటూ’ గురించి రాస్తూ గర్భంలోనే చంపేసిన శిశు ప్రాణాలకు, గుళ్ళలో ఊళ్లలో, సేలల్లో, సెలకల్లో జరిగిన అవమానాలకు ఎన్నిసార్లు ఇక్కడ ‘మీటూ’ అనాలో చెప్పుమని ప్రశ్నిస్తాడు. “పాడే చోట/ ఆడే చోట/ అక్షరాల్ని పొత్తిళ్లలో ఆలింగనం చేసే చోట/ చెంబట్టుకపోయే చోట/ చేలకల్లో చిదుకులకై పోరే చోట/ ఎన్ని చోట్ల మీటు చెప్పాలో” (మీటూ) అంటాడు. పెదాల మీద నినాదాన్ని గుండెల్లో చంపేసి మీటూ అనడం బాగానే ఉంది కానీ, “మీలో ‘మనం’ లేకుండా/ టూ లో ‘తనం’ లేకుండా మాట్లాడుతున్నప్పుడు/ ఖైర్లాంజి గుండెల్లో మంట రాజేస్తూనే వుందని” చరిత్రను కళ్ళ ముందుంచుతాడు.ఈ కవితా సంపుటిలో త్రిపురనేని శ్రీనివాస్, చెన్నయ్య, కాలేకూరి, పూలన్ దేవి, రామలింగం తదితర సంస్మరణ కవితలతో పాటు రోహిత్, మధుకర్, కోటేశు అఖ్లాక్ నెత్తుటి చరిత్ర మరియు చుండూరు, లక్ష్మింపేట, రోహ్యాంగాల దుఃఖ ప్రస్తావన మనల్ని ఆలోచింపజేస్తాయి. “మౌనాన్ని బద్దలు కొట్టే విగ్రహాలుంటాయి/ ఫ్యూడల్ పెత్తనం అంతు చూసే చూపుడు వేళ్ళుంటాయి (యుద్ధం చేసే విగ్రహం) అంటూ “గరగపర్ర ఒక ప్రారంభం/ ఆగిరిపల్లి ఒక పోరాట వీచిక/ ఇక చుండూరు, లక్షింపేట మనల్ని వెక్కిరించే/ నిస్సహాయ యుద్ధ గీతాలు…ఐనా/ విగ్రహం యుద్ధం చేస్తూనే ఉంటుంది” అని మనలో ఆలోచనరేకెత్తిస్తాడు.

అలాగే చాలా కవితలు సామ్రాజ్యవాదం పై దండెత్తుతుంటాయి. కుల వ్యవస్థను, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తాయి. అనేక పోరాట యోధుల్ని గుర్తు చేసి వారిమార్గం వైపు పయనించేటట్లు చేస్తాయి. అంతే కాకుండా మట్టి మీద మమకారాన్ని పెంచుతూ మనిషి నడవడి ఎలా ఉండాలో చాటి చెబుతాయి. వాస్తవానికి ఇప్పుడొక పాట నిషేధమైన సందర్భంలో బహుజన దృక్పథంతో ఆలోచిస్తూ, అడుగులేస్తూ దోపిడి లేని నవ సమాజ నిర్మాణ తపనకై శత్రువుపై కత్తి దూస్తూ ‘కంచెమీద పక్షిపాట‘ ను వెలువరించిన రవికుమార్ కు అభినందనలు తెలియజేస్తున్నాను.

(ప్రచురణ: సిక్కోలు బుక్ ట్రస్ట్, పేజీలు: 120, వెల:110/-,

ప్రతులకు: డా.నూకతోటి రవికుమార్, 98481 87416)

బిల్ల మహేందర్ 9177604430

ప్రజాశక్తి సాహిత్య పేజీకి ధన్యవాదాలతో..

Please Post Your Comments & Reviews

Your email address will not be published. Required fields are marked *